పెన్షనర్ల
పెండింగ్ బకాయిలు చెల్లించాలనీ,
సమగ్ర
ఆరోగ్య పథకం అమలు చేయాలని కోరుతూ
18.02.2026న
ఉదయం 11 గం.ల నుండి మధ్యాహ్నం 3 గం.ల వరకు
హైదరాబాద్
లోని ఇందిరా పార్కు వద్ద జరిగే
మహా ధర్నాని జయప్రదం చేయండి
పెన్షనర్ మిత్రులారా !
తెలంగాణ
రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగులు, పెన్షనర్ల
సమస్యలన్నీ ఇట్టే పరిష్కారం అవుతాయని భావించి అనేక సమస్యలపై పోరాటాలను పక్కన పెట్టి
రాష్ట్రం కొరకు పోరాటం చేసి సాధించుకున్నాం. కాని
రాష్ట్రం ఏర్పడిన తరువాత సమస్యలు పరిష్కారం కాకపోగా ప్రతినెలా వేతనాలు/ పెన్షన్లు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో మన సూచనమేరకు మా ప్రభుత్వం ఏర్పడితే తక్కువ సమయంలోనే మీ సమస్యలు
పరిష్కరిస్తాం అని ఎన్నికల మానిఫెస్టోలో కూడా పెట్టి హామీ ఇస్తే ప్రస్తుత ప్రభుత్వ
ఏర్పాటుకు బహిరంగంగానే మద్దతు ఇచ్చి తెచ్చుకున్నాము. ఈ ప్రభుత్వంలో
కూడా కేవలం వేతనాలు/ పెన్షన్లు
నెల మొదటి తేదీన చెల్లించే ఏర్పాటు తప్ప మరే సమస్య పరిష్కారం కాలేదు. ముఖ్యంగా రెండు సమస్యలు ప్రస్తుతం పెన్షనర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాదాపు 40 మంది
ఆ ఆందోళనతోనే మరణించారు. అందులో
కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ మరణాలన్నిటికీ
ప్రస్తుత ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
పెన్షనర్ల
ప్రధాన సమస్యలలో మొదటిది ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల పెన్షన్ బకాయిలు గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పిఎఫ్, సరెండర్ లీవ్, జిఎల్ఐ, జిఐసీ తదితర బిల్లులు ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉండడం. ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ ఆధ్వర్యంలో మొదటి
దశలో 2024 జులైలో రాష్ట్రంలోని 85/ 105 ఎస్.టి.ఓల ముందు, 2024 ఆగష్టులో 24 జిల్లా కలెక్టొరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి
మొమారాండంలు సమర్పించాము. ఈ ఆందోళన
కార్యక్రామాలను చూసిన తరువాత పెన్షనర్స్ జేయేసీ ముందుకు వచ్చి ఇదే డిమాండ్ ని ప్రధానం
చేస్తూ రాష్ట్ర స్థాయి జేయేసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాము. తదుపరి టిజిఈ జేఏసీ కూడా రంగంలోకి దిగి లాల్ బహదూర్ స్టేడియంలో లక్షమందితో
సదస్సుకు శ్రీకారం చుట్టింది. అప్పుడు
ప్రభుత్వంలో చలనం వచ్చింది. చర్చలకు
పిలిచింది. ఒక డిఏ ఇచ్చింది. త్వరలోనే
అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు టిజిఈజెఏసీ పోరాట కార్యక్రమాన్ని
వాయిదా వేసింది. కాని తరువాత కూడా
కొన్ని చిన్న చిన్న డిపార్ట్ మెంటల్ వారీ సమస్యల పరిష్కారం తప్ప మరే ఇతర
సమస్యలు పరిష్కారం కాలేదు.
మార్చి 2024 తదుపరి రిటైర్ అయిన పెన్షనర్ల పెన్షన్
బెనిఫిట్లు ఒక సంవత్సర కాలం పూర్తి కావస్తున్నా చెల్లించక పోవడంతో తెలంగాణ ఆల్ పెన్షనర్స్
రిటైర్డ్ & పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే 29.04.2025న మళ్లీ పెద్దఎత్తున రాష్ట్ర కేంద్రంలో
ధర్నా కార్యక్రమం నిర్వహించాం. తదుపరి
పెన్షనర్ సంఘాల కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో
11.08.2025న పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాము. ఉపాధ్యాయ
సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర ధర్నా అనంతరం ప్రభుత్వం మళ్లీ చర్చలకు పిలిచింది. రెండు డిఏలు(మొదలు
ఒకటి, 6నెలల అనంతరం ఇంకొకటి) ఇస్తాను
అన్నది. ప్రతినెలా రు. 700 కోట్టు
బకాయిలు చెల్లిస్తాము అంది. అన్నట్లుగా 2 డిఏలు వచ్చాయి. గత నాలుగైదు
నెలలుగా ప్రతినెలా రు. 700 కోట్లు
బకాయిలు చెల్లిస్తుండవచ్చు కూడా. కాని
అవి ఎవరికి అందుతున్నాయో తెలియడం లేదు. ఉద్యోగ
విరమణలు మొదలు అయిన మొదటి నెల మార్చి 2024లో రిటైర్
అయిన వారికి కూడా ఇంతవరకు మొత్తం బకాయిలు చెల్లింపు జరగడం లేదు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో పలుకుబడి కలిగిన వారికి మాత్రమే అందుతున్నాయని
ఆరోపణలు ఉన్నాయి. బకాయిల
చెల్లింపు అనేది ఒక క్రమ పద్దతిలోట్రెజరీకి మొదట వచ్చిన బిల్లులను మొదట చెల్లించాలని
ప్రాతినిథ్యం చేశాము. కాని
మార్పు లేదు. కాగా ప్రతి నెలా రు. 700 కోట్లు
చెల్లిస్తున్నా ప్రతినెలా కొత్తాగా రిటైర్ అవుతున్న వారు కూడా చేరడంతో బకాయిలు పెరుగుతున్నాయే
తప్ప తగ్గడం లేదు. తమ బకాయి
డబ్బులు ఎప్పుడు వస్తాయో అనేది తెలియకుండా పోతోంది.
ఈ పూర్వరంగంలో 2025 నవంబర్ 11 న రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో బకాయిలు చెల్లించాలని కోరుతూ నిరాహార దీక్షలు చేపట్టాము. ఖమ్మం జిల్లాలో వరుసగా 7 రోజులు నిరాహార దీక్షలు చేసారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఆందోళన చేయాలని ఇటీవల టాప్ర ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించగా కొందరు పెన్షనర్లు నిరాహార దీక్షలు చేయాలనీ, తీవ్ర మానసిక ఆందోళనతో ఇంట్లోనే మరణించే బదులు నిరాహార దీక్షా శిబిరంలోనే
చనిపోతామని అన్నారు. పెన్షనర్ల
ఈ తీవ్ర మనో వేధనను అర్థం చేసుకున్న టాప్ర ఈ నెల 18నుండి
పెన్షనర్ల బకాయిలు చెల్లించాలనీ, సమగ్రమైన
ఆరోగ్య పథకాన్ని రూపొందించి అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహారదీక్షలు చేయనున్నామని
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చాము. కాని
రిలే కాదుకదా ఒకరోజు నిరాహార దీక్షకు కూడా పర్మిషన్ ఇచ్చేది లేదని, ఒకరోజు పెద్దఎత్తున ధర్నా చేసుకోండని పోలీసు యంత్రాంగం ఇచ్చిన సూచన మేరకు 18వ తేదీన ధర్నా కార్యక్రమం చేపట్టాము.
మనం నోటీసు
ఇచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఈహెచ్ఎస్ పథకం అమలు చేసే కొత్త
విధానంపై సమావేశం నిర్వహించారు. మన ప్ర.కా.కృష్ణ మూర్తి గారు దానికి హాజరైనారు. పథకం
అమలు బాగానే కనిపిస్తున్నా 1.5శాతం
కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. 1శాతం
సరిపోతుంది. మొదటి వేతన సవరణ కమిషన్ అదే సూచించింది. నిజానికైతే
ఏ విధమైన కాంట్రిబ్యూషన్ లేకుండానే వైద్య సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై
ఉంది. మనం మొదటినుండి అదే కోరుతున్నాము. కాని
చాలా సంఘాలు కాంట్రిబ్యూషన్ చెల్లించడానికి సిద్దమైనందున పెన్షనర్ జేయేసీలో భాగంగా
మనం కూడా 1శాతం చెల్లింపుకు అంగీకరించాము. రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిజిహెచ్ఎస్ స్కీంలో నెలకు రు.
1000 మాత్రమే చెల్లించి వైద్య సదుపాయాలు పొందుతున్నారు. కాని మన దగ్గర
మాత్రం కొందరి దగ్గరైనా నెలకు రు.
1500 పైనే వసూలు చేసే విధానానికి మనం అంగీకరించకూడదు. ఈ విధానాన్ని
వృద్డాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెన్షనర్లుగా అంగీకరించవచ్చు
అనుకున్నా, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు ససేమిరా అంగీకరించకపోవచ్చు. ఈ స్కీములో చేరడానికీ, చేరకుండా
ఉండడానికీ ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చేరని
వారికి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ 1.5శాతాన్ని
మెడికల్ అలవెన్స్ గా ఇస్తే తాము ఏదైనా ప్రైవేటు హెల్త్ స్కీములో చేరతాము అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సిజిహెచ్ఎస్ పథకం, వివిధ
రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను పరిశీలిస్తే ఉద్యోగుల కేడర్ ని బట్టి మూడు రకాలుగా విభజించి 0.50, 0.75 గరిష్టంగా 1శాతంగా
కాంట్రిబ్యూషన్ ని నిర్ణయించడం మేలు అంటున్నాము. నగదు
రహిత వైద్యం అందించాలి అని కోరుతున్నాము.
డిమాండ్లు:
·
పెన్షనర్ల గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పిఎఫ్ తదితర పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. నెలకు రు 1,000 కోట్లు కేవలం పెన్షనర్ల
బకాయిలు చెల్లించడానికి కేటాయించి ట్రెజరీకి మొదట వచ్చిన బిల్లులను మొదటగా చెల్లించాలి.
·
సమగ్రమైన ఆరోగ్య
పథకాన్ని రూపొందించి నగదు రహిత వైద్యం (ఐపి మరియు ఓపి) అన్ని ఆసుపత్రులలో అందేలా చేయాలి.
·
మొదటి వేతన సవరణ
కమిషన్ సూచించినట్లు 20 సం.ల సర్వీసుకు పూర్తి పెన్షన్ తదితర సూచనలపై ఉత్తర్వులు ఇవ్వాలి.
·
398 స్పెషల్ టీచర్ సర్వీసుకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్ కు వర్తింపజేయాలి.
ఉద్యమాభివందనాలతో.
ఎంఎన్
రెడ్డి, పి నారాయణ
రెడ్డి, పి కృష్ణ
మూర్తి, జి.అశోక్
9441284852, 9440602180, 8309211256, 9490300725
తెలంగాణ
ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్
పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటి
T A P R P A State Committee
Visit: www.taprpa.weebly.com, www.taprpa.blogspot.com
